Oct 3, 2009

నీవు నేను కలిస్తే ఇలా ఉంటుంది


నీ అందం
నా అందం
జీవితపు మకరందం

నీ మౌనం
నా మౌనం
కన్నీరునీ జీవితం
నా జీవితం
ఈ జన్మ సరిపోదు

నీ అన్వేషణ
నా అన్వేషణ
ఒకే దగ్గర ముగిస్తుంది
నీ ఇష్టం
నా ఇష్టం
దోరగా పండిన పనస 

నీ పిలుపు
నా పిలుపు
పదాలకు ఊపిర్లూదుతున్న అర్ధాలు


నీ నవ్వులు
నా  నవ్వులు
నిశ్శబ్దం లో నీటి గల గలలునీ ధ్యానం
నా ధ్యానం
ఒకరిలో ఒకరం అంతర్ధానంనీ పరిమళం
నా పరిమళం
విచ్చుకున్న ప్రేమ దళంనీ కోరిక
నా కోరిక
అవసరం వద్ద ఆగాయి

 

తల్లి వాత్సల్యం


నడిరేయిలో ఒక్క ఉదుటున ఉలిక్కి పడి
తన బిడ్డను ఆత్రుతగా చూసుకొని ఆప్యాంగా తడిమి
తన్మయత్వం చెందే తల్లి వాత్సల్యం
ప్రభూ , కృష్ణా! నీవే కదూ  ..... !!
ధన్యోస్మి

సంవృత న్యాయంఆథిద్యం ఇవ్వలేని పేదవాడిని
ప్రేమ తప్ప
ప్రాథినిధ్యం తెలియని మూగవాడిని
ప్రియా ఈ అర్హత సరిపోదు కదూ ...?
నేను నీకు విలువిస్తాను
నీవు సమాజానికి విలువిస్తావు
ఇదేనేమో సంవృత న్యాయం(Transitive)
నీలా మారి నన్నుశాసిస్తుంది సమయం ..

పెళ్ళి


మనసు మాట శరీరం వినదు
శరీరం మాట మనసు వినదు
ధర్మ బధ్ధంగా
మనసుకు ఇంకో శరీరం
శరీరానికి ఇంకో మనసు తోడు కావాలి
అదే " పెళ్ళి "......

లక్షల తారకలు


అమావాస్య అని , చంద్రుడు సెలవు తీసుకున్నాడు,
లక్షల తారకలు తమ తళుకులతో పరిచయం చేసుకుంటూనే ఉన్నాయి
ఎప్పటిలాగే చంద్రుడొచ్చాడు
ఈ సారి అమావాస్య కొరకు ఎదురుచూపు...
తారాతోరణాలని.. ఆకాశ ఆభరణాలని వీక్షించాలని...

నిష్కల్మషం...


కొంగలు ఉదయాన్నే శబ్దం చేస్తూ వెళ్తున్నాయి
ఆ కలకలస్వానాలవల్ల
తక్షణం నదీ తీరాన్ని చేరింది మనసు...
ఆహా !! పక్షులు ఎంత నిష్కల్మషం...

క్షణాలు...క్షణాలు జారిపొయే బాధను మరిచి
అవి చేసే స్వరాల లయలో లీనం అయ్యింది మనసు...

తేనెటీగ

 

నేను తేనెటీగను
మధురాన్ని సేకరించటమే కాదు...
కాపాడుకోవటానికి, ముల్లు కూడా వదలగలను....

స్వఛ్ఛమైన నిశ్శబ్దం


నిన్నే గానం చేస్తూ పూజించటం ఎలా ?
అడిగింది పూవు సూర్యున్ని
"స్వఛ్ఛమైన నీ నిశ్శబ్దం ద్వారా"
బదులిచ్చాడు ... ఆదిత్యుడు

సమాధి

ప్రభూ, నా సమాధిపై
నీ "ప్రేమికుడు" అనే ఒక్క పదం చాలు
నా జన్మ ధన్యం

ఖడ్గం


ఖడ్గం పదునేంటో ఒరను అడుగు ...
 మనసు పదునేంటో నా శరీరాన్ని అడుగు ...

కమలం


కమలాన్ని అడిగాను నీళ్ళపై ఎలా తేలావని ?
అధారం.. సంకల్పాన్ని తోస్తూ ఉంటే .....
ముడుచుకు ఉండలేక పొడుచుకు వచ్చానన్నది

ఏముందో ..... నీకు తెలుసు...


తూనీగల సమూహం కనబడింది
ఏదో నీటి చెలమ ఉందని తెలిసింది ...
నాలో భావాల తుంపర ఎగిసింది..
ఏముందో ..... నీకు తెలుసు...

పెదవులపై మెరుపు


నీటి గలగలా తరంగాలపై బంగారు మిల మిల
ప్రియతమా...........
ఇది నీ పెదవులపై మెరుపు కదా
ఇది మన వలపుల మైమరుపు కాదా
నా పిచ్చి నీకు తెలియంది కాదు
నన్ను భరిస్తున్న నీకు ఇది కొత్తేం కాదు

చిరు గాలి


నిదురలో ఉన్న నిన్ను, మెలకువలో ఉన్న తాను, తాకి వచ్చానని....
 బేరసారాలు ఆడింది చిరు గాలి నాతో .......
నా హృదయంలో నిన్ను గమనించి... నిశ్శబ్దమయ్యింది...
నా వెచ్చని శ్వాసతో బయలు దేరింది నీ వైపు ... దానితో కాస్త జాగ్రత్త ప్రియతమా !!

నీ సాన్నిహిత్యం            నిన్ను చేరాక ....నీ రంగు చేరదా - ఒక సీతాకోక చిలుక
                       ఏమో నీ సాన్నిహిత్యానికే ఎరుక.......

కళ్ళు ..మధుర వేదనని అనుభవిస్తున్నాయి..


కళ్ళు తమని తాము,నిన్ను దర్శించిన చిత్రాల్లో కుంచెలా అద్దుకొని
తమ మధుర సంతకాల్ని..
నీ హృదయంలో.. లోతైన,సూక్ష్మాతి సూక్ష్మ మార్మిక మనుగడపై
వదులుదామని, ఆపై తేలికపడి...వదులుగా మారుదామని..

మాటల్లో చెప్పుకోలేని మధుర వేదనని అనుభవిస్తున్నాయి..

అస్థిత్వం అద్దానికి అందుతుందా ?


అస్థిత్వం అద్దానికి అందుతుందా ?
అద్దం నిన్ను చూపించిందా ?
లేక నీవు అనుకుంటున్న ' నిన్ను'ని  చూపించిందా ?
అరే ... మూర్తి !!  ప్రపంచం తీర్చగలదా నీ ఆర్తి  ??

నన్నడుగు ప్రియతమా !!


నీవేమిటనేది నీకు తెలియదు....
నన్నడుగు ప్రియతమా !!
నిన్ను తలచుకొని మౌనాశృవులలో మునిగి
మాట  రాక
నీ భావాల్తో ఎరుపెక్కి
ఝుమ్మంటున్న హృదయంతో
నేనే నీవై సుధా రసాలను స్రవిస్తాను ...

నా నిద్రవై చేరుకుంటావు


నాకై నేను అలిసిపోతే మౌనముద్రలో ఉంటావు
నీకై 'నే' అలిసిపొతే నా నిద్రవై చేరుకుంటావు
ఆ పై నీతో మేల్కొంటాను .. నులివెచ్చని ఉషోదయం లోకి
అరవిచ్చిన జ్ఞానంలోకి ....