Dec 20, 2009

పెళ్ళి

తమ ఇంటి సంపదని , వంశపు అందాల స్త్రీ  సౌశీల్యాన్ని
ఒక ఇంటికి దానంగా కన్యాదానంగా చెల్లిస్తారు జీవితపు మూల్యాన్ని

ఇక సిధ్ధమవుతాయి అన్నీ, ఎక్కడ చూడూ అలికిడి
పందిరి లేస్తుంది,జాజు, ముగ్గులు అందమయిన రంగులు అలంకరిస్తాయి పెళ్ళిని పోటీపడి

తోరణాలు,కళ్ళతో కలత పెట్టే కన్నె హరిణాలు
రెండు ఇల్లల్లోని బంధువుల తిరునాళ్ళు

పిల్లల హడావిడి, పట్టు లంగాలతో చిట్టి తల్లుల సందడి
క్షేమ సమాచారాలు, వెనకటి బాసలతో అప్పుడప్పుడు కంటతడి

ఇంతలోనే మొగుతాయి మంగళ ధ్వనులు
పరుగులు తీస్తారు అందరూ వారి మధ్యలో మెరుపు సుందరీమణులు

పైత్యానికి విరుగుడు జిలకరా బెల్లం
నిత్యమై మెలగమంది మొగుడు పెళ్ళాం

అంటారు ముసి ముసి నవ్వులతో , కన్నెపిల్లలు అల్లరితో
విన్నా విననట్టు ఒకరినొకరు ఒడలు మరిచి కూర్చుంటారు ఆత్రుతతో

వరుడుని శ్రీ హరిగా భావించి,
వధువుని మహా లక్ష్మిగా దీవించి

ఏడడుగులు వేయమని
ఒకరి ఎదలో మరొకరు చేరమని

హృదయమే గుర్తులుగా మాంగళ్యంతో ఒక్కటవుతారు ఇద్దరు
నిండిన గుండెల సవ్వడితో మేళతాలాలతో దీవిస్తారు అందరు

ఒడ్లు ఒలిచిన ధాన్యం, తాను వలచిన రూపం, పక్కనే ఉంటాయి
తలంబ్రాలుగా మారి సంబరాలు చేయమంటాయి

ఒంటినిండా పసుపుతో, కాళ్ళకి పారాణితో రతీ మన్మదులను తలపిస్తూ
ఒకరిలోకి ఒకరు లీనమవుతారు సిగ్గులను కురిపిస్తూ

శారదా బ్రహ్మలు, సీతా రాములు,అర్ధనారీశ్వరులు
శొభనంగా కరగిన మీలో చేరి కురిపిస్తారు అన్యొన్యపు సిరులు

పగటి పూటే ఒక చుక్కను చూపిస్తారు భవిష్యత్తుకు సూచనగా
పెద్దవారి పై విశ్వాసంతో అనుకరిస్తారు ఇద్దరు,గొప్ప ఆలోచనగా

మెట్టినింటినింటికి సాక్షిగా మెట్టలు కాళ్ళకి
పుట్టినింటి జ్ఞాపకాలు తరగని కన్నీళ్ళు కళ్ళకి

అప్పగింతలు గుండె కోతలు
ఎడబాటులు బతుకు వెతలు

అయినా సున్నితాన్ని అనుచుకొని, దిగమింగుకొని బయలు దేరుతుంది
తన జీవితం తలచుకొని , భర్తే దైవమని మెట్టినింటికి చేరుతుంది

నాలాంటి తనయుల్ని ముద్దు ముద్దు బిడ్డలని కమనీయంగా ప్రకృతిలోకి తెస్తుంది
తన్మయత్వంతో బాధలను మరిచి పిల్లలే శ్వాసగా ఎన్నొ కలలను కంటుంది

మళ్ళీ  పిల్లల పెళ్ళిల్లు,బాధ్యతలు నెరవేరుస్తారు
వారి ఎదుగుదలలో కన్నీళ్ళై చెమరుస్తారు

ఇదే అనాదిగా జరుగుతున్న మంగళ కార్యం
వంశ వృధ్ధి కొరే జీవన సౌందర్యం




నిత్యకళ్యాణం పచ్చతోరణంగా వెలిగే శ్రియః పతికి, ఏడుకొండలవాడి పాద పద్మాలకి అర్పిస్తూ
నరసింహ మూర్తి