Aug 6, 2011

మధురాతి పతేః అఖిలం మధురం

శ్రీ రామానుజస్య చరణౌ శరణం ప్రపధ్యే ... శ్రీమతే రామానుజాయ నమః

హే కృష్ణా ......

మనసుకు నీవు కావాలి ... ప్రపంచంలో ఉండటానికి నాకు మనసు కావాలి .
మాటలు తమను మీటిన అనుభూతలను మోసుకుని బయలుదేరాయి...
ఏవో లోకాలకు ఈ లోకం సరిపోదని.ఊహలు నీపై తమని తాము పారేసుకుని,తమదైన ప్రపంచాన్ని వదలలేక, ఉంటున్న ఈ లోకంలో ఇమడలేక తెగ ఇబ్బంది పడుతున్నాయి.శరీరం విచిత్రానుభూతుల రసాయన మధుర సమ్మేళనంగా తోస్తోంది...
ఉద్దీపనం చెందిన కణాలు నీలోనే,నీతోనే న్యాయం చేకూరుతుంది అంటున్నాయి.
చూపు నిలిపిన కన్నులు,చూసేది తాము కాదని, చూపేది వేరే ఉందని ఒక అవగాహనకు వచ్చాయి.. తల్లడిల్లుతున్న మనసుకు తనలోని అలలకు తాను కారణం కాదని అర్ధం అవుతోంది.నిన్ను పొందిన క్షణాలు తాము కాలంలో భాగమే కాదు అంటున్నాయి.తనను తాను ఉథ్థాన పతనాలకు గురిచేసుకుంటున్న గుండె ఎప్పుడు,ఎలా మొదలయ్యిందో తెలియని వింత స్వరాలలో లీనం అవుతూ కొన్ని వేల జన్మల తరువాత సాఫల్యం పొందినట్టుగా తపస్సులోంచి అప్పుడే తనను తాను తెరుచుకున్న మునిలా ప్రపంచాన్ని అనుభూతి చెందుతూ ఉంది.నీవు చూపించే ప్రతి సన్నివేశం నన్ను నీలో కలుపుతూ నీకు దగ్గర చేస్తూనే ఉంది.నీలోని తేమను చల్లగా తాకాలని ఎన్నో ప్రయత్నాలు చేసాను... నా శ్వాసలోని వెచ్చదనం నీవే... నా ఆశలోని ఆర్తివీ నీవే.మనో ఆకాశంలో తేలికతనం నీవే..చంద్రునిలో బరువైన అందం నీవే.
వేగంగా జీవితం నాలోకి దూసుకుపోతున్న అనుభూతి కల్గుతోంది..
అంతరంగంలో,నిరంతారనుభూతిలో,నీవే నిండి నింగిలా ....
బయటకు వ్యాపిస్తున్న భావాలను ఆపుకోలేకపోతున్నాను.నిన్ను పొందాలని వేగాన్ని పెంచాను ,ప్రపంచ రాగాలన్నీ తెంచాను.వేటిని వేరు చేయాలో వేటిలో మమేకమవుదామో తెలియని వింత ఆలోచనా,అనుభూతికి లోనవుతుంది జీవితం... ఇంత లోతైంది కాబట్టే,మనుగడకే మనుగడ కాబట్టి .. జీవించే క్షణాల్లోనే ప్రేమ కనబడుతుంది. మరణించే క్షణాల్లో అంతా తానే ఉన్నానని వాత్సల్యాన్ని కురిపిస్తుంది,నిర్జీవాన్ని జీవంగా మార్చటానికి,నాలో నిన్ను నిండుగా నింపటానికి.ప్రేమను నింపుకున్నాక .... నింపింది ఎవరు? నిండింది ఎవరు ? ఎవరు ?
ఏక ప్రవాహం అనంత జీవన ప్రవాహం...న అహం ...
వేల సంవత్సరాల గాఢ మౌనం ఒక పదంగా మారితే ... అది "కృష్ణా" అంటుంది ...........
నీకై విల విల లాడుతున్న ఈ మనసుకు వెల కట్టకు ప్రభూ.... పద్మాలను సమర్పించే పరిపక్వత నాలో లేదు... ప్రస్తుతం మందారాలే...పరిమళం లేదని పక్కకు పెట్టకు... నీవు కరుణిస్తే... ఆర్ద్రతా హృదయంతో అరవిందాలతో కూడా త్వరలోనే నీ పాదాలను అర్చిస్తాను ప్రభూ...  

శ్రీ కృష్ణార్పణమస్తు...
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ

Dec 20, 2009

పెళ్ళి

తమ ఇంటి సంపదని , వంశపు అందాల స్త్రీ  సౌశీల్యాన్ని
ఒక ఇంటికి దానంగా కన్యాదానంగా చెల్లిస్తారు జీవితపు మూల్యాన్ని

ఇక సిధ్ధమవుతాయి అన్నీ, ఎక్కడ చూడూ అలికిడి
పందిరి లేస్తుంది,జాజు, ముగ్గులు అందమయిన రంగులు అలంకరిస్తాయి పెళ్ళిని పోటీపడి

తోరణాలు,కళ్ళతో కలత పెట్టే కన్నె హరిణాలు
రెండు ఇల్లల్లోని బంధువుల తిరునాళ్ళు

పిల్లల హడావిడి, పట్టు లంగాలతో చిట్టి తల్లుల సందడి
క్షేమ సమాచారాలు, వెనకటి బాసలతో అప్పుడప్పుడు కంటతడి

ఇంతలోనే మొగుతాయి మంగళ ధ్వనులు
పరుగులు తీస్తారు అందరూ వారి మధ్యలో మెరుపు సుందరీమణులు

పైత్యానికి విరుగుడు జిలకరా బెల్లం
నిత్యమై మెలగమంది మొగుడు పెళ్ళాం

అంటారు ముసి ముసి నవ్వులతో , కన్నెపిల్లలు అల్లరితో
విన్నా విననట్టు ఒకరినొకరు ఒడలు మరిచి కూర్చుంటారు ఆత్రుతతో

వరుడుని శ్రీ హరిగా భావించి,
వధువుని మహా లక్ష్మిగా దీవించి

ఏడడుగులు వేయమని
ఒకరి ఎదలో మరొకరు చేరమని

హృదయమే గుర్తులుగా మాంగళ్యంతో ఒక్కటవుతారు ఇద్దరు
నిండిన గుండెల సవ్వడితో మేళతాలాలతో దీవిస్తారు అందరు

ఒడ్లు ఒలిచిన ధాన్యం, తాను వలచిన రూపం, పక్కనే ఉంటాయి
తలంబ్రాలుగా మారి సంబరాలు చేయమంటాయి

ఒంటినిండా పసుపుతో, కాళ్ళకి పారాణితో రతీ మన్మదులను తలపిస్తూ
ఒకరిలోకి ఒకరు లీనమవుతారు సిగ్గులను కురిపిస్తూ

శారదా బ్రహ్మలు, సీతా రాములు,అర్ధనారీశ్వరులు
శొభనంగా కరగిన మీలో చేరి కురిపిస్తారు అన్యొన్యపు సిరులు

పగటి పూటే ఒక చుక్కను చూపిస్తారు భవిష్యత్తుకు సూచనగా
పెద్దవారి పై విశ్వాసంతో అనుకరిస్తారు ఇద్దరు,గొప్ప ఆలోచనగా

మెట్టినింటినింటికి సాక్షిగా మెట్టలు కాళ్ళకి
పుట్టినింటి జ్ఞాపకాలు తరగని కన్నీళ్ళు కళ్ళకి

అప్పగింతలు గుండె కోతలు
ఎడబాటులు బతుకు వెతలు

అయినా సున్నితాన్ని అనుచుకొని, దిగమింగుకొని బయలు దేరుతుంది
తన జీవితం తలచుకొని , భర్తే దైవమని మెట్టినింటికి చేరుతుంది

నాలాంటి తనయుల్ని ముద్దు ముద్దు బిడ్డలని కమనీయంగా ప్రకృతిలోకి తెస్తుంది
తన్మయత్వంతో బాధలను మరిచి పిల్లలే శ్వాసగా ఎన్నొ కలలను కంటుంది

మళ్ళీ  పిల్లల పెళ్ళిల్లు,బాధ్యతలు నెరవేరుస్తారు
వారి ఎదుగుదలలో కన్నీళ్ళై చెమరుస్తారు

ఇదే అనాదిగా జరుగుతున్న మంగళ కార్యం
వంశ వృధ్ధి కొరే జీవన సౌందర్యం
నిత్యకళ్యాణం పచ్చతోరణంగా వెలిగే శ్రియః పతికి, ఏడుకొండలవాడి పాద పద్మాలకి అర్పిస్తూ
నరసింహ మూర్తి

Oct 17, 2009

ఎదురు చూపులునీ ఎదురు చూపుల్లో
ఎద ఏరై పారింది ...
       అభిషేకం నీకు ....అదే పదివేలు నాకు ......


Oct 15, 2009

నా హృదయం


పదునైన కత్తులు దేనికి ..
                మృదువైన హృదయానికి .......


మాట ఒక్కటి చాలు దానికి..
             మసి అయిపోవటానికి..........


Oct 12, 2009

కడలి .... కన్నీరు
కడలిని ప్రేమించి కన్నీరు కార్చాను
అదేంటో అవి కూడా ఉప్పుగానే ఉన్నాయి
అప్పుడు తెలిసింది ........
అన్నిటికీ అధారం ప్రేమని
కడలికీ కన్నీటికీ ఆధారం ఒకటేనని

నీతో నా భావాలు
"అద్దాన్ని అద్దంలో ప్రతిబింబించాలి అని వుంది నీ జాడ ఏది ప్రియతమా ?
నిన్ను నాలో నింపాదిగా చూసుకోలేక .. నిన్ను నీవు నిలువరించలేక పోతున్నావా? "
" హృదిలోను .. మదిలోనూ నిప్పును రాజేసిందెవరు....
                                మానసికంగా శారీరకంగా నా నుంచి నన్ను కాజేసింది ఎవరు ? "
" అశాశ్వతమైన ఈ శరీరం లో శాశ్వతంగా ఎలా వుండగలుగుతున్నావు ప్రేమా "

" మండే వేసవి చల్లిని నా గుండెని చేరి సేద తీరింది .. మరి నీవు ? "

 " నీలోని భావాలకి నా హృదయం ఎరుపెక్కింది .. నీ భావాల స్పందన .. నా ప్రతిస్పందనా ఇదే కదా జీవితం .!!"
" నీలా నీవు వ్యక్తమవుతూనే వున్నావు,నాకే అర్హత లేదు నిన్ను అందుకోవటానికి 
నా మనసే నాకు అడ్డం అయ్యింది,త్వరగా దానిని హరించు ప్రియతమా   "

నిన్ను తెలుపుదామని...


ఎన్నో పదాలు ఆత్రుతతో ఎదురుచూస్తున్నాయి...
                                                     నిన్ను తెలుపుదామని...
కొన్ని పదాలు మౌన తపస్సు చెపట్టాయి ..
                                               నీ భావాలని ద్విగుణీకృతం చేద్దామని..
కొన్ని కంటినిండా నీటితో ఉన్నాయి...
                                                    నీ ముందు ఒలుకుదామని
కొన్ని చిలిపితనంతో చిందులు వేస్తున్నాయి
                                                నీ సాంగత్యం లో కులుకుదామని ....
కొన్ని పదాలు నిప్పుల్లా మారాయి ...  
                                                  నీ హృదయానికి వెచ్చదనం పంచాలని....
కొన్ని పదాలు భావంలో మునిగి ఇంతవరకూ రాలేదు.....
               వాటిని నీతో పాటు తీసుకువస్తావని నాకు తెలుసు ....
                                            మైమరుపుతో మురిసిపోతోంది మనసు....

ఇట్లు
నీ మూర్తి


హృదయం ఉన్నది


హృదయం ఉన్నది పగలటానికేనేమో...
           ఎంత పగిలినా కొంత మిగిలే ఉంటుంది ..!!
               మళ్ళీ పగలటానికేనేమో ??....

అంధకారం


అంధకారం నిన్ను అందుకోవాలని రాదు...
జీవిత సత్యాన్ని తాను నీకు తెలిపితేగానీ పోదు ....

చీదరించి ఛీ! పొమ్మంటే.. చీకటి నిను భయపెడుతుంది ..
చిరునవ్వుతో అంగీకరిస్తే... జ్ఞాన వాకిలిలో దిగపెడుతుంది ...

నీవూ కఠినమై వేదించకూ ...


మనసు నిప్పులా మారింది....
సాక్షిగా...
కన్నీరు వెచ్చగా ఉబికింది...
మరీ వేదించకు నేస్తమా !!
మనసు అగ్ని గుండంలా మారుతుంది..
కన్నీరు ఆవిరవుతుంది...
నా ఆస్తి అదే దాన్ని కూడా హరించకూ ...
లోకంతో పాటూ నీవూ కఠినమై వేదించకూ ...
అయినా భరిస్తాను , నన్ను మాత్రం దిగజార్చకు