Aug 6, 2011

మధురాతి పతేః అఖిలం మధురం

శ్రీ రామానుజస్య చరణౌ శరణం ప్రపధ్యే ... శ్రీమతే రామానుజాయ నమః

హే కృష్ణా ......

మనసుకు నీవు కావాలి ... ప్రపంచంలో ఉండటానికి నాకు మనసు కావాలి .
మాటలు తమను మీటిన అనుభూతలను మోసుకుని బయలుదేరాయి...
ఏవో లోకాలకు ఈ లోకం సరిపోదని.ఊహలు నీపై తమని తాము పారేసుకుని,తమదైన ప్రపంచాన్ని వదలలేక, ఉంటున్న ఈ లోకంలో ఇమడలేక తెగ ఇబ్బంది పడుతున్నాయి.శరీరం విచిత్రానుభూతుల రసాయన మధుర సమ్మేళనంగా తోస్తోంది...
ఉద్దీపనం చెందిన కణాలు నీలోనే,నీతోనే న్యాయం చేకూరుతుంది అంటున్నాయి.
చూపు నిలిపిన కన్నులు,చూసేది తాము కాదని, చూపేది వేరే ఉందని ఒక అవగాహనకు వచ్చాయి.. తల్లడిల్లుతున్న మనసుకు తనలోని అలలకు తాను కారణం కాదని అర్ధం అవుతోంది.నిన్ను పొందిన క్షణాలు తాము కాలంలో భాగమే కాదు అంటున్నాయి.తనను తాను ఉథ్థాన పతనాలకు గురిచేసుకుంటున్న గుండె ఎప్పుడు,ఎలా మొదలయ్యిందో తెలియని వింత స్వరాలలో లీనం అవుతూ కొన్ని వేల జన్మల తరువాత సాఫల్యం పొందినట్టుగా తపస్సులోంచి అప్పుడే తనను తాను తెరుచుకున్న మునిలా ప్రపంచాన్ని అనుభూతి చెందుతూ ఉంది.నీవు చూపించే ప్రతి సన్నివేశం నన్ను నీలో కలుపుతూ నీకు దగ్గర చేస్తూనే ఉంది.నీలోని తేమను చల్లగా తాకాలని ఎన్నో ప్రయత్నాలు చేసాను... నా శ్వాసలోని వెచ్చదనం నీవే... నా ఆశలోని ఆర్తివీ నీవే.మనో ఆకాశంలో తేలికతనం నీవే..చంద్రునిలో బరువైన అందం నీవే.
వేగంగా జీవితం నాలోకి దూసుకుపోతున్న అనుభూతి కల్గుతోంది..
అంతరంగంలో,నిరంతారనుభూతిలో,నీవే నిండి నింగిలా ....
బయటకు వ్యాపిస్తున్న భావాలను ఆపుకోలేకపోతున్నాను.నిన్ను పొందాలని వేగాన్ని పెంచాను ,ప్రపంచ రాగాలన్నీ తెంచాను.వేటిని వేరు చేయాలో వేటిలో మమేకమవుదామో తెలియని వింత ఆలోచనా,అనుభూతికి లోనవుతుంది జీవితం... ఇంత లోతైంది కాబట్టే,మనుగడకే మనుగడ కాబట్టి .. జీవించే క్షణాల్లోనే ప్రేమ కనబడుతుంది. మరణించే క్షణాల్లో అంతా తానే ఉన్నానని వాత్సల్యాన్ని కురిపిస్తుంది,నిర్జీవాన్ని జీవంగా మార్చటానికి,నాలో నిన్ను నిండుగా నింపటానికి.ప్రేమను నింపుకున్నాక .... నింపింది ఎవరు? నిండింది ఎవరు ? ఎవరు ?
ఏక ప్రవాహం అనంత జీవన ప్రవాహం...న అహం ...
వేల సంవత్సరాల గాఢ మౌనం ఒక పదంగా మారితే ... అది "కృష్ణా" అంటుంది ...........
నీకై విల విల లాడుతున్న ఈ మనసుకు వెల కట్టకు ప్రభూ.... పద్మాలను సమర్పించే పరిపక్వత నాలో లేదు... ప్రస్తుతం మందారాలే...పరిమళం లేదని పక్కకు పెట్టకు... నీవు కరుణిస్తే... ఆర్ద్రతా హృదయంతో అరవిందాలతో కూడా త్వరలోనే నీ పాదాలను అర్చిస్తాను ప్రభూ...  

శ్రీ కృష్ణార్పణమస్తు...
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ