Sep 1, 2009

ప్రేమ లేఖ



ఎక్కడున్నావు ప్రియతమా ? నీవూ నాలాగా కట్టుబాట్లకు కట్టుబడిపొయావా ?
అనుబంధాల మధ్య నలిగింది చాలు ... నా హృదయాన్ని చేరి సేద తీరు నేడు.నీవు లేని తనాన్ని వదిలేసి , నీ లోకం లో విహరించాలి అని ఊహలు ఏవేవో కలలు కంటున్నాయి.. సంగీతం సరిగమలను వెతికినట్టు సంతోషం నిన్ను వెతుకుతూ బయలుదేరింది .. బాధ్యతలు ఊరుకుంటాయా నిరంకుశంగా దానిని వెనకకు లాగుతూనే ఉంటాయి. ఎక్కడున్నాను నేను ? ఎక్కడికి చేరుతాను ఏమో ?  నీకోసం ఇలా మిగిలాను.... మాటలతో సముదాయిస్తే మనసు వినదు ప్రియతమా .. నీవన్నా కావాలి లెదంటే మత్తునైనా అందివ్వాలి అంటోంది వెర్రి మనసు. నిజంగా ప్రేమ అంత దొరకనిదా ? అంతటా ఉంటుంది అని తృప్తి పడటమే కాని అందిపుచ్చుకొని ఆనంద పడింది లేదు.. కన్నీటి పొరల్లో దాగున్న కసి నన్ను నిందిస్తూ ఉంది నాకేమి పట్టదని.. సొమరిని అని.. నేనెలా చెప్పగలను నీవే నా బలం, నీవే నా బలహీనత కూడా అని. ప్రతిరోజూ వింత పోకడలతో స్పందించే హృదయ సవ్వడి... జీవితాన్ని కుదిపేస్తూ ఉంది.ఇఛ్ఛ మంటలోని నీలిమలా మారింది... మనసు మసి బారిన దీపం లా కూర్చుంది. వెలుగు ఆరక ముందే ఆదుకో.. ఆదుకొని అందుకో ..అందుకొని గుండెలో అదుముకో.. అదుముకొని అమృతంలో ముంచు .. నీలో ముంచుకొని నను కరుణించు... ఈ మానిసిక జాఢ్యాన్ని విదిలించి .. వదిలించి విడుదల చేయి..
వ్యక్తులు.. వ్యవహారాలు ...సంపదా..సంస్కారం ఇవన్నీ ప్రపంచంకోసం నేను వేసుకున్న ముసుగులుగా తోస్తున్నాయి.నీ రాక తెలియక పోతే నాకు నేనే ముసుగునవుతానేమో ? చెలీ కరుణించు ఎంతొ శ్రమకోర్చి బయటపడతాను నీ కోసం .. ఆ సమయంలో నీవుండవు ... మళ్ళీ కూరుకుపోతానేమో! భయంగా ఉంది


తత్త్వ శాస్త్రం,మానసిక శాస్త్రం,విజ్ఞాన శాస్త్రం,సామాజిక శాస్త్రం,ఇవన్నీ బుధ్ధిని బంధించగలిగాయి కాని... హృదయ వేదనను ఇసుమంతైన తేలిక పరచలేదు... నీవొచ్చే వరకు నేను మిగులుతానో లేదో ..కనీసం ఈ ప్రేమలేఖని చదువుతావని ... కాలంలో అవషేశంగా ... నీ విషేశంగా మిగులుదామని ... దుమ్ముకొట్టుకు పొయిన ఈ పనికిమాలిన మనసు ఆశ ... ఎవరు విన్నా వినక పోయినా ఇది చేరాల్సిన చోటికి చేరుతోందని నాకు తెలుసు..కాక పోతే నేనంటేనే నీకు అలుసు .. నిన్ను నిందించాలని లేదు ప్రియతమా ... నా దురదృష్టం అక్షరాలలొ అలా దొర్లుతూ ఉంది..నీకు కదలటం ఇష్టముండదు కదా అలాగే కూర్చో, నిన్ను నీవు మోసం చేసుకొంటూ ... చిరుగాలి నీ దరికి చేరుతుంది ఓ రొజు నా పరిమళాన్ని మోసుకుంటూ....
జీవితం రహస్యాలను ఒక్కోక్కటి విప్పుతూ ఉంటే ... గాఢ మౌనంలో,తనలో తాను లీనం అవుతూ ... హృదయం, మాటల్లో చెప్పలేని వింత ఘోష చేస్తూ ఉంది .. ఆ ఘోషలో నా ఆశ సంలీనమయ్యింది తిరిగి రాలేదు ఇంతవరకు ... నేను మిగిలి ఉంటే నీతో పాటు దానిని మోసుకొస్తావని ..నాలోని ఆశలకు ..అంతర్లీన నిరాశలకు ... నీతో స్వాంతన చేకూరుస్తావని .. మౌనంలోకి మునుగుతున్నాను.... ఉంటాను