Dec 20, 2009

పెళ్ళి

తమ ఇంటి సంపదని , వంశపు అందాల స్త్రీ  సౌశీల్యాన్ని
ఒక ఇంటికి దానంగా కన్యాదానంగా చెల్లిస్తారు జీవితపు మూల్యాన్ని

ఇక సిధ్ధమవుతాయి అన్నీ, ఎక్కడ చూడూ అలికిడి
పందిరి లేస్తుంది,జాజు, ముగ్గులు అందమయిన రంగులు అలంకరిస్తాయి పెళ్ళిని పోటీపడి

తోరణాలు,కళ్ళతో కలత పెట్టే కన్నె హరిణాలు
రెండు ఇల్లల్లోని బంధువుల తిరునాళ్ళు

పిల్లల హడావిడి, పట్టు లంగాలతో చిట్టి తల్లుల సందడి
క్షేమ సమాచారాలు, వెనకటి బాసలతో అప్పుడప్పుడు కంటతడి

ఇంతలోనే మొగుతాయి మంగళ ధ్వనులు
పరుగులు తీస్తారు అందరూ వారి మధ్యలో మెరుపు సుందరీమణులు

పైత్యానికి విరుగుడు జిలకరా బెల్లం
నిత్యమై మెలగమంది మొగుడు పెళ్ళాం

అంటారు ముసి ముసి నవ్వులతో , కన్నెపిల్లలు అల్లరితో
విన్నా విననట్టు ఒకరినొకరు ఒడలు మరిచి కూర్చుంటారు ఆత్రుతతో

వరుడుని శ్రీ హరిగా భావించి,
వధువుని మహా లక్ష్మిగా దీవించి

ఏడడుగులు వేయమని
ఒకరి ఎదలో మరొకరు చేరమని

హృదయమే గుర్తులుగా మాంగళ్యంతో ఒక్కటవుతారు ఇద్దరు
నిండిన గుండెల సవ్వడితో మేళతాలాలతో దీవిస్తారు అందరు

ఒడ్లు ఒలిచిన ధాన్యం, తాను వలచిన రూపం, పక్కనే ఉంటాయి
తలంబ్రాలుగా మారి సంబరాలు చేయమంటాయి

ఒంటినిండా పసుపుతో, కాళ్ళకి పారాణితో రతీ మన్మదులను తలపిస్తూ
ఒకరిలోకి ఒకరు లీనమవుతారు సిగ్గులను కురిపిస్తూ

శారదా బ్రహ్మలు, సీతా రాములు,అర్ధనారీశ్వరులు
శొభనంగా కరగిన మీలో చేరి కురిపిస్తారు అన్యొన్యపు సిరులు

పగటి పూటే ఒక చుక్కను చూపిస్తారు భవిష్యత్తుకు సూచనగా
పెద్దవారి పై విశ్వాసంతో అనుకరిస్తారు ఇద్దరు,గొప్ప ఆలోచనగా

మెట్టినింటినింటికి సాక్షిగా మెట్టలు కాళ్ళకి
పుట్టినింటి జ్ఞాపకాలు తరగని కన్నీళ్ళు కళ్ళకి

అప్పగింతలు గుండె కోతలు
ఎడబాటులు బతుకు వెతలు

అయినా సున్నితాన్ని అనుచుకొని, దిగమింగుకొని బయలు దేరుతుంది
తన జీవితం తలచుకొని , భర్తే దైవమని మెట్టినింటికి చేరుతుంది

నాలాంటి తనయుల్ని ముద్దు ముద్దు బిడ్డలని కమనీయంగా ప్రకృతిలోకి తెస్తుంది
తన్మయత్వంతో బాధలను మరిచి పిల్లలే శ్వాసగా ఎన్నొ కలలను కంటుంది

మళ్ళీ  పిల్లల పెళ్ళిల్లు,బాధ్యతలు నెరవేరుస్తారు
వారి ఎదుగుదలలో కన్నీళ్ళై చెమరుస్తారు

ఇదే అనాదిగా జరుగుతున్న మంగళ కార్యం
వంశ వృధ్ధి కొరే జీవన సౌందర్యం




నిత్యకళ్యాణం పచ్చతోరణంగా వెలిగే శ్రియః పతికి, ఏడుకొండలవాడి పాద పద్మాలకి అర్పిస్తూ
నరసింహ మూర్తి

Oct 17, 2009

ఎదురు చూపులు



నీ ఎదురు చూపుల్లో
ఎద ఏరై పారింది ...
       అభిషేకం నీకు ....అదే పదివేలు నాకు ......


Oct 15, 2009

నా హృదయం


పదునైన కత్తులు దేనికి ..
                మృదువైన హృదయానికి .......


మాట ఒక్కటి చాలు దానికి..
             మసి అయిపోవటానికి..........


Oct 12, 2009

కడలి .... కన్నీరు




కడలిని ప్రేమించి కన్నీరు కార్చాను
అదేంటో అవి కూడా ఉప్పుగానే ఉన్నాయి
అప్పుడు తెలిసింది ........
అన్నిటికీ అధారం ప్రేమని
కడలికీ కన్నీటికీ ఆధారం ఒకటేనని

నీతో నా భావాలు




"అద్దాన్ని అద్దంలో ప్రతిబింబించాలి అని వుంది నీ జాడ ఏది ప్రియతమా ?
నిన్ను నాలో నింపాదిగా చూసుకోలేక .. నిన్ను నీవు నిలువరించలేక పోతున్నావా? "
" హృదిలోను .. మదిలోనూ నిప్పును రాజేసిందెవరు....
                                మానసికంగా శారీరకంగా నా నుంచి నన్ను కాజేసింది ఎవరు ? "
" అశాశ్వతమైన ఈ శరీరం లో శాశ్వతంగా ఎలా వుండగలుగుతున్నావు ప్రేమా "

" మండే వేసవి చల్లిని నా గుండెని చేరి సేద తీరింది .. మరి నీవు ? "

 " నీలోని భావాలకి నా హృదయం ఎరుపెక్కింది .. నీ భావాల స్పందన .. నా ప్రతిస్పందనా ఇదే కదా జీవితం .!!"
" నీలా నీవు వ్యక్తమవుతూనే వున్నావు,నాకే అర్హత లేదు నిన్ను అందుకోవటానికి 
నా మనసే నాకు అడ్డం అయ్యింది,త్వరగా దానిని హరించు ప్రియతమా   "

నిన్ను తెలుపుదామని...


ఎన్నో పదాలు ఆత్రుతతో ఎదురుచూస్తున్నాయి...
                                                     నిన్ను తెలుపుదామని...
కొన్ని పదాలు మౌన తపస్సు చెపట్టాయి ..
                                               నీ భావాలని ద్విగుణీకృతం చేద్దామని..
కొన్ని కంటినిండా నీటితో ఉన్నాయి...
                                                    నీ ముందు ఒలుకుదామని
కొన్ని చిలిపితనంతో చిందులు వేస్తున్నాయి
                                                నీ సాంగత్యం లో కులుకుదామని ....
కొన్ని పదాలు నిప్పుల్లా మారాయి ...  
                                                  నీ హృదయానికి వెచ్చదనం పంచాలని....
కొన్ని పదాలు భావంలో మునిగి ఇంతవరకూ రాలేదు.....
               వాటిని నీతో పాటు తీసుకువస్తావని నాకు తెలుసు ....
                                            మైమరుపుతో మురిసిపోతోంది మనసు....

ఇట్లు
నీ మూర్తి


హృదయం ఉన్నది


హృదయం ఉన్నది పగలటానికేనేమో...
           ఎంత పగిలినా కొంత మిగిలే ఉంటుంది ..!!
               మళ్ళీ పగలటానికేనేమో ??....

అంధకారం


అంధకారం నిన్ను అందుకోవాలని రాదు...
జీవిత సత్యాన్ని తాను నీకు తెలిపితేగానీ పోదు ....

చీదరించి ఛీ! పొమ్మంటే.. చీకటి నిను భయపెడుతుంది ..
చిరునవ్వుతో అంగీకరిస్తే... జ్ఞాన వాకిలిలో దిగపెడుతుంది ...

నీవూ కఠినమై వేదించకూ ...


మనసు నిప్పులా మారింది....
సాక్షిగా...
కన్నీరు వెచ్చగా ఉబికింది...
మరీ వేదించకు నేస్తమా !!
మనసు అగ్ని గుండంలా మారుతుంది..
కన్నీరు ఆవిరవుతుంది...
నా ఆస్తి అదే దాన్ని కూడా హరించకూ ...
లోకంతో పాటూ నీవూ కఠినమై వేదించకూ ...
అయినా భరిస్తాను , నన్ను మాత్రం దిగజార్చకు

Oct 11, 2009

నిన్ను చేరుదామాని....


నీ తలపులతో తడిచి మైమరిచిన హృదయం.                                              నీ జాడ కానరాక తీవ్ర వేదనకు గురైంది.
పని చూసుకోవాలో,హృదయాన్ని చూడాలో అర్థం కాక దిక్కులు చూస్తోంది మనసు.
బుధ్ధికి విషయం అంతుచిక్కక వ్యర్థ సుఖాలకై పాకుతూ ఉంది.
జీవిత సారం జీవించటంలో ఉంది అంటారు...సముదాయించటానికే సరిపోయింది..
జీవించటం జీవించినంత అసత్యంగా మారింది...
హృదయం మరీ ముదిరింది...
నన్ను ఇన్ని భాగాలుగా విడదీసిన నిన్ను చేరుదామాని....

చెమర్చిన భావం నేను


ఆలోచనా మేఘం పై
అరవిచ్చిన  పుష్పం పై
చెమర్చిన భావం నేను
ఏమార్చిన హృదయం నేను

ప్రాణమై బదులిస్తా


ప్రశ్నలతో ఒంపకు నన్ను
ప్రణయంతో నింపేస్తా !
ప్రాయమై కవ్విస్తే ...
నీ ప్రాణమై బదులిస్తా ....

నాకు కన్నీటి భాషను నేర్పు


కళ్ళతో హృదయాన్ని తాగుతావు
చూపుల్తో మనసును తాకుతావు
విషయం అడిగితే ... కన్నీళ్ళై ఒలుకుతావు
హే, ప్రభూ ! నాకు కన్నీటి భాషను నేర్పు

నిన్ను ఎవరని అనుకోను ?


నలుపు ఓ వైపు నను తరుముతూ ఉంటే
వెండి వెలుగు వెచ్చగా చేరువవుతూ ఉంటే
నిన్ను ఎవరని అనుకోను.... ?
హృదయాన్ని తడిపే రుధిరం అనుకోనా ?
పాదాన్ని నడిపే మౌనం అనుకోనా  ?
గతమై గడిపే అవగతమనుకోనా ?
అవును ......
ఇది మనసు ఆడే వింత నాటకం
సొగసుని కోల్పోయే ఆలోచనా కంటకం

సందేహం ...............ప్రేమ



 సందేహం తనను తాను ధ్వంసం చేసుకునే వరకు ..
                                          మనని పరిశోదించడానికి ప్రోత్సహిస్తూనే వుంటుంది........
 ప్రేమ తనను తాను అంకితం చేసుకునే దాకా ........
                                                     ప్రపంచాన్ని భరిస్తూనే ఉంటుంది .....

Oct 10, 2009

ఎవరు ఆపారు ఈ మృదుసంతకాల్ని ?



ఆశల ప్రవాహాం.. అందులో నేను మునగటం తేలటం
ఆ పై నిన్ను తలవటం
అంతలోనే చూపులు నిలిపివేయటం
సిగ్గుతో నన్ను నిలదీయటం
ఎవరు ఆపారు ఈ మృదుసంతకాల్ని ?
నాకు నేనే అడ్డయ్యాను... నన్ను నేను ఎలా దాటగలను

చేరాల్సిన గమ్యం నీవు


జననంతో వెచ్చగా తోడుండి
మరణంతో చల్లబరచి పోతావు...
ప్రాణమా నిన్ను నేను నమ్మలేను
ప్రాణాధారమా .. కాస్త దాన్ని కరుణించు
ప్రణయమా త్వరగా త్వరపడు... చేరాల్సిన గమ్యం వైపు 

Oct 9, 2009

ఎవరూలేని వింత ఎడారిలో


అంతందంగా పూసావేంటే ముద్దుల గులాబి
ఎవరూ లేని వింత ఎడారిలో.....

అంత కమ్మని పాటలేంటే వన్నెల కొయిలా
బాటసారులే లేని ఈ వింత రహదారిలో

అంతదమయిన నవ్వేంటే ఓ నాగమల్లీ
నాగుల నడుమ వాగుల నడుమా

మనుషులు లేని చోట మహా ప్రశాంతంగా ఉంటుంది కదూ

చల్లని గాలిలా మారి నీ చుట్టూ వీస్తుంది


కదలని కళ్ళతో కాలాన్ని కదిలిస్తూ ఉంటాను
వదలని నీ భావాలను ఒంటరిగా మోస్తూ ఉంటాను

హృదయం విరహంతో నిన్నే చూస్తూ ఉంది
చల్లని గాలిలా మారి నీ చుట్టూ వీస్తుంది

గుండె పగిలితే
మనసు విరిగితే

సడిలేకుండా వచ్చి సందేశం ఇస్తావు
పగిలిన ముక్కలు ఏరేలోపు మల్లీ పగులుతుంది

వెతకటంతోనే సరిపోయింది జీవితం
బ్రతుకులోని తీపి నీకే అంకితం

నీ కవితగా మిగిలిన విశేషాన్ని


బహుమతులు పొందలేదు
అనుమతులు అందలేదు
నేనొక అవశేషాన్ని
నీ కవితగా మిగిలిన విశేషాన్ని

బ్రతకటంలో కళ నీకే అంకితం


హృదయమనే మాటొచ్చి
ఓటమికే ఓర్పొచ్చి
ఓడి,గెలిచింది జీవితం
బ్రతకటంలో కళ నీకే అంకితం

అనుభూతి కలిపితే అంతరంగాలు


నన్ను నేను పరిచయం చేయాలా
నిండు కుండకు మట్టితెలియదా ?

నీలో మునిగితే తరంగాలు
అనుభూతి కలిపితే అంతరంగాలు

మురళికి తెలుసు నీ పెదవుల మృదువెంతో
కనులకు తెలుసు కనపడని మధువెంతో
చెవులకు తెలుసు... నీ పలుకుల మధురిమెంతో

వేటినడిగినా ఏదో ఒకటి చెబుతాయి
చెప్పలేని నేను
విప్పలేని నన్ను
విశాల గగనంలోకి విసిరాను
రసాణువులు నిన్ను చేరాలని
చేరి, పదిరెట్లై నాపై కురవాలని

Oct 8, 2009


నీ అందం హృదయాన్ని కుచ్చుతూ ఉంటే
కవిత్వం గులాబీలా విరబూసింది
ఇప్పుడు తెలిసింది గులాబీతో పాటు ముల్లెందుకు ఉంటుందో

ఎవరికీ ...మాట వినని మనసు...


ఎవరికీ ...మాట వినని మనసు...
ఎదురు దెబ్బకి విన్నది

ఎందుకూ పనికిరాని బ్రతుకు
పాత బాట వీడింది

నీవు కఠినంగా మారే కన్నా ..


నీవు కఠినంగా మారే కన్నా ..
నాకోసం రెండు కన్నీళ్ళు కోరుకుంటాను

నా మీద నీ జాలి కన్నా ..
శాశ్వతంగా నీ నుంచి జారిపోవాలనుకుంటాను

ఒక వైపు నియమం ..మరువైపు ప్రణయం


అలసింది హృదయం
తడిసింది నయనం

ఒక వైపు నియమం
మరువైపు ప్రణయం

ఎటువైపు పయనం
అడిగింది గమనం

నియమంతో పని లేదు
నీవే కావాలి

ప్రణయమే పయనమై
నీతో సాగాలి

Oct 7, 2009

పరిమళాన్ని పట్టుకు పారిపోయే పిల్లగాలివి నీవు

పరిమళాన్ని పట్టుకు పారిపోయే పిల్లగాలివి నీవు
మృదువైన శరీరంగా తోచే కఠిన శిలవు నీవు
వేడిలేకుండా దహించే శీతలం నీవు
మౌనాన్ని సైతం బంధించగల మూగవేదనవు నీవు
బలవంతంగా నన్ను నాకు అప్పగించే నగ్న సత్యానివి నీవు

ఏది తప్పు ? ఏది ఒప్పు ?


ఏది తప్పు ? ఏది ఒప్పు ?
నీలో నిప్పును రగిలించు
ఆలొచనతో పని కాదు
ఆచరణతో అంతరంగమై జ్వలించు

Oct 6, 2009

నాకు నేను కాకుండా చేస్తావు


అధో పాతాలానికో...
విశాల ఆకశంలొకో

తొక్కి పెడతావో ......
విసిరివేస్తావో ....

మొత్తానికి నాకు నేను కాకుండా చేస్తావు
కౌగిలై ,హృదయాన్ని పిండెస్తావు

ప్రపంచం


ప్రపంచ పరిమాణం ఎంతా ?
నా హృదయంలో పరమాణువంత!!

Oct 5, 2009

అర్హత


అర్హత, అందాన్ని ఆస్వాదించనీయదు ....
ఆలొచన, హృదయాన్ని అంకితం అవనివ్వదు...

హృదయ పలక


అంత పెద్ద కొండలను,లోయలను మనసు హృదయ పలక పై పరుస్తుంటే ....
అసలు బరువెక్కటం లేదేంటి ?
హృదయాన్ని చేరేవన్నీ ఇలానే తేలిక పడతాయేమో ?

పెళ్ళి ఎవరికీ ?




పెళ్ళి ఎవరికీ ?
భావం లేని జీవాలకా ?
జీవం లేని శవాలకా ?

పెళ్ళి ఎవరికీ?
వికసించిన హృదయాలకా ?
విడలేని ప్రణయాలకా ?

తొలగిందా నీలోని అహం


నిన్ను నీవు తెలుసుకో ...
వినయమెరిగి మసలుకో
తొలగిందా నీలోని అహం
ప్రపంచమే నీకు దాసోహం...

Oct 4, 2009

నిన్ను చేరుతూ ఉంటాను


మనసుకు వేగమెక్కువ.....
జీవితానికి మలుపులెక్కువ....
అందుకే
హృదయమై నింగిలో తేలుతూ ఉంటాను
తక్షణమే నిన్ను చేరుతూ ఉంటాను 

నిన్ను చేరనప్పుడు


రెక్కలుండి ఏం లాభం ... నిన్ను చేరనప్పుడు
నీవు లేని జీవితమెందుకు... అదొక తీగ తెగిన వీణ చప్పుడు

చిరునవ్వు


ఆరిపోయిన గుండెకి చినుకు తడి చాలదా ?
ఓడిపోయిన మనసుకు చిరునవ్వూ అలాంటిదే కదా...

ఆయువు నింపే అమృతమా ...
ఈ మృత జీవిని ప్రేమతో నింపుమా ...

Oct 3, 2009

నీవు నేను కలిస్తే ఇలా ఉంటుంది


నీ అందం
నా అందం
జీవితపు మకరందం

నీ మౌనం
నా మౌనం
కన్నీరు



నీ జీవితం
నా జీవితం
ఈ జన్మ సరిపోదు

నీ అన్వేషణ
నా అన్వేషణ
ఒకే దగ్గర ముగిస్తుంది




నీ ఇష్టం
నా ఇష్టం
దోరగా పండిన పనస 

నీ పిలుపు
నా పిలుపు
పదాలకు ఊపిర్లూదుతున్న అర్ధాలు


నీ నవ్వులు
నా  నవ్వులు
నిశ్శబ్దం లో నీటి గల గలలు



నీ ధ్యానం
నా ధ్యానం
ఒకరిలో ఒకరం అంతర్ధానం



నీ పరిమళం
నా పరిమళం
విచ్చుకున్న ప్రేమ దళం



నీ కోరిక
నా కోరిక
అవసరం వద్ద ఆగాయి

 

తల్లి వాత్సల్యం


నడిరేయిలో ఒక్క ఉదుటున ఉలిక్కి పడి
తన బిడ్డను ఆత్రుతగా చూసుకొని ఆప్యాంగా తడిమి
తన్మయత్వం చెందే తల్లి వాత్సల్యం
ప్రభూ , కృష్ణా! నీవే కదూ  ..... !!
ధన్యోస్మి

సంవృత న్యాయం



ఆథిద్యం ఇవ్వలేని పేదవాడిని
ప్రేమ తప్ప
ప్రాథినిధ్యం తెలియని మూగవాడిని
ప్రియా ఈ అర్హత సరిపోదు కదూ ...?
నేను నీకు విలువిస్తాను
నీవు సమాజానికి విలువిస్తావు
ఇదేనేమో సంవృత న్యాయం(Transitive)
నీలా మారి నన్నుశాసిస్తుంది సమయం ..

పెళ్ళి


మనసు మాట శరీరం వినదు
శరీరం మాట మనసు వినదు
ధర్మ బధ్ధంగా
మనసుకు ఇంకో శరీరం
శరీరానికి ఇంకో మనసు తోడు కావాలి
అదే " పెళ్ళి "......

లక్షల తారకలు


అమావాస్య అని , చంద్రుడు సెలవు తీసుకున్నాడు,
లక్షల తారకలు తమ తళుకులతో పరిచయం చేసుకుంటూనే ఉన్నాయి
ఎప్పటిలాగే చంద్రుడొచ్చాడు
ఈ సారి అమావాస్య కొరకు ఎదురుచూపు...
తారాతోరణాలని.. ఆకాశ ఆభరణాలని వీక్షించాలని...

నిష్కల్మషం...


కొంగలు ఉదయాన్నే శబ్దం చేస్తూ వెళ్తున్నాయి
ఆ కలకలస్వానాలవల్ల
తక్షణం నదీ తీరాన్ని చేరింది మనసు...
ఆహా !! పక్షులు ఎంత నిష్కల్మషం...

క్షణాలు...



క్షణాలు జారిపొయే బాధను మరిచి
అవి చేసే స్వరాల లయలో లీనం అయ్యింది మనసు...

తేనెటీగ

 

నేను తేనెటీగను
మధురాన్ని సేకరించటమే కాదు...
కాపాడుకోవటానికి, ముల్లు కూడా వదలగలను....

స్వఛ్ఛమైన నిశ్శబ్దం


నిన్నే గానం చేస్తూ పూజించటం ఎలా ?
అడిగింది పూవు సూర్యున్ని
"స్వఛ్ఛమైన నీ నిశ్శబ్దం ద్వారా"
బదులిచ్చాడు ... ఆదిత్యుడు

సమాధి

ప్రభూ, నా సమాధిపై
నీ "ప్రేమికుడు" అనే ఒక్క పదం చాలు
నా జన్మ ధన్యం

ఖడ్గం


ఖడ్గం పదునేంటో ఒరను అడుగు ...
 మనసు పదునేంటో నా శరీరాన్ని అడుగు ...

కమలం


కమలాన్ని అడిగాను నీళ్ళపై ఎలా తేలావని ?
అధారం.. సంకల్పాన్ని తోస్తూ ఉంటే .....
ముడుచుకు ఉండలేక పొడుచుకు వచ్చానన్నది

ఏముందో ..... నీకు తెలుసు...


తూనీగల సమూహం కనబడింది
ఏదో నీటి చెలమ ఉందని తెలిసింది ...
నాలో భావాల తుంపర ఎగిసింది..
ఏముందో ..... నీకు తెలుసు...