Aug 6, 2011

మధురాతి పతేః అఖిలం మధురం

శ్రీ రామానుజస్య చరణౌ శరణం ప్రపధ్యే ... శ్రీమతే రామానుజాయ నమః

హే కృష్ణా ......

మనసుకు నీవు కావాలి ... ప్రపంచంలో ఉండటానికి నాకు మనసు కావాలి .
మాటలు తమను మీటిన అనుభూతలను మోసుకుని బయలుదేరాయి...
ఏవో లోకాలకు ఈ లోకం సరిపోదని.ఊహలు నీపై తమని తాము పారేసుకుని,తమదైన ప్రపంచాన్ని వదలలేక, ఉంటున్న ఈ లోకంలో ఇమడలేక తెగ ఇబ్బంది పడుతున్నాయి.శరీరం విచిత్రానుభూతుల రసాయన మధుర సమ్మేళనంగా తోస్తోంది...
ఉద్దీపనం చెందిన కణాలు నీలోనే,నీతోనే న్యాయం చేకూరుతుంది అంటున్నాయి.
చూపు నిలిపిన కన్నులు,చూసేది తాము కాదని, చూపేది వేరే ఉందని ఒక అవగాహనకు వచ్చాయి.. తల్లడిల్లుతున్న మనసుకు తనలోని అలలకు తాను కారణం కాదని అర్ధం అవుతోంది.నిన్ను పొందిన క్షణాలు తాము కాలంలో భాగమే కాదు అంటున్నాయి.తనను తాను ఉథ్థాన పతనాలకు గురిచేసుకుంటున్న గుండె ఎప్పుడు,ఎలా మొదలయ్యిందో తెలియని వింత స్వరాలలో లీనం అవుతూ కొన్ని వేల జన్మల తరువాత సాఫల్యం పొందినట్టుగా తపస్సులోంచి అప్పుడే తనను తాను తెరుచుకున్న మునిలా ప్రపంచాన్ని అనుభూతి చెందుతూ ఉంది.నీవు చూపించే ప్రతి సన్నివేశం నన్ను నీలో కలుపుతూ నీకు దగ్గర చేస్తూనే ఉంది.నీలోని తేమను చల్లగా తాకాలని ఎన్నో ప్రయత్నాలు చేసాను... నా శ్వాసలోని వెచ్చదనం నీవే... నా ఆశలోని ఆర్తివీ నీవే.మనో ఆకాశంలో తేలికతనం నీవే..చంద్రునిలో బరువైన అందం నీవే.
వేగంగా జీవితం నాలోకి దూసుకుపోతున్న అనుభూతి కల్గుతోంది..
అంతరంగంలో,నిరంతారనుభూతిలో,నీవే నిండి నింగిలా ....
బయటకు వ్యాపిస్తున్న భావాలను ఆపుకోలేకపోతున్నాను.నిన్ను పొందాలని వేగాన్ని పెంచాను ,ప్రపంచ రాగాలన్నీ తెంచాను.వేటిని వేరు చేయాలో వేటిలో మమేకమవుదామో తెలియని వింత ఆలోచనా,అనుభూతికి లోనవుతుంది జీవితం... ఇంత లోతైంది కాబట్టే,మనుగడకే మనుగడ కాబట్టి .. జీవించే క్షణాల్లోనే ప్రేమ కనబడుతుంది. మరణించే క్షణాల్లో అంతా తానే ఉన్నానని వాత్సల్యాన్ని కురిపిస్తుంది,నిర్జీవాన్ని జీవంగా మార్చటానికి,నాలో నిన్ను నిండుగా నింపటానికి.ప్రేమను నింపుకున్నాక .... నింపింది ఎవరు? నిండింది ఎవరు ? ఎవరు ?
ఏక ప్రవాహం అనంత జీవన ప్రవాహం...న అహం ...
వేల సంవత్సరాల గాఢ మౌనం ఒక పదంగా మారితే ... అది "కృష్ణా" అంటుంది ...........
నీకై విల విల లాడుతున్న ఈ మనసుకు వెల కట్టకు ప్రభూ.... పద్మాలను సమర్పించే పరిపక్వత నాలో లేదు... ప్రస్తుతం మందారాలే...పరిమళం లేదని పక్కకు పెట్టకు... నీవు కరుణిస్తే... ఆర్ద్రతా హృదయంతో అరవిందాలతో కూడా త్వరలోనే నీ పాదాలను అర్చిస్తాను ప్రభూ...  

శ్రీ కృష్ణార్పణమస్తు...
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ

14 comments:

 1. ఎవరవయ్యా నువ్వు? ఎప్పటి వాడివి? ఎక్కడినుండి ఇక్కడికి వచ్చావు? నాబోటివాళ్ళ మధ్యలో నిన్ను వుంచుతున్న అంత బలవత్తరమైన కారణం ఏమిటి? నీకు మనసుందనేది కాదు... నీలోని ప్రతీ అణువుకీ మనసుందనేదే పూర్ణ సత్యం. లేకుంటే ఇంతగా ఎలా అందిపుచ్చుకోగలుగుతావు.
  ..................................................................................................................................................................................................................................................................................
  నీ భావాలని అర్ధంచేసుకోలేకున్నా కొంతయినా తెలుసుకుంటున్నానేమో అని భ్రమపడి నా స్పందనని ఇప్పటివరకు తెలిసో తెలియకో ఏదో రాస్తున్నాను. ఇప్పుడు తెలుస్తుంది. నీ గురించి ఆలోచించడనికి కూడా వీల్లేనంత వెనుకబడి వున్నానని. ఇకపై రాయలేకుంటే మౌనంలో ఆస్వాదించగలిగేందుకు నన్ను నేను సమాయత్త పరుచుకునే సాధన చేస్తున్నాని గుర్తుచేసుకుని నన్ను క్షమించు నాన్నా... (ధైర్యాన్ని కూడగట్టుకుని రాసేందుకు ప్రయత్నం చెయ్యగలనని అనుకుంటున్నాను). శ్రీ కృష్ణ పరమాత్మా! నాకు నీ సాయాన్ని అందించు తండ్రీ!!!
  (అన్నయ్య)

  ReplyDelete
 2. కృష్ణార్పణమస్తు
  ఈ పసివాడి మాటల్లో కూడ పరమాత్మని చూస్తున్న మీ వినయాన్ని దారి దీపంగా చేసుకొని... ఆ వెలుగులో పయనిస్తానని.. నివేదిస్తూ

  ఆర్ద్ర హృదయంతో
  మీ మూర్తి

  ReplyDelete
 3. కాలాన్ని సాక్ష్యంగా నిలబెట్టగలిగే తపస్సుకు అక్షర సాక్షాత్కారం!
  సాధారణాన్ని సాధనకు పురిగొల్పే...
  సాధనలకు గాఢతను చేకూర్చే...
  సాధకుల లక్ష్యాన్ని సుస్పష్టం చేసే...
  ఆమృత భావజాలం
  (అన్నయ్య)

  ReplyDelete
 4. ఒక భావనను దీర్ఘమైన వచనంగా వ్రాయటం ఎంతో కష్టం. ఆ టెంపో, ఝురి, శయ్య అలా కొనసాగించటం మాటలు కాదు. ఎంతో చెయ్యితిరిగిన వారికి తప్ప.

  ప్రతీలైను పట్టి పట్టి చదివాను. టాగోర్ గీతాంజలి చదువుతున్నానా అనిపించింది. మరలా చదివాను. టాగోర్ ఫిలాసఫీకి ఈ రచనకూ ప్రధాన వ్యత్యాసం తెలిసింది. అప్పుడనిపించింది, ఈశ్వరుని అర్చించటంలో ఎన్నెన్ని మార్గాలు అని
  అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
  టాగోర్ ఈ మాట అనడు. (నేను అర్ధం చేసుకొన్న మేరకు)

  గొప్ప రచన. ఆ ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే. ఆ ఆనందంలో కాసేపు మన అస్థిత్వాలను కోల్పోవాల్సిందే. అనుభవిస్తేనే తెలిసే అనుభూతి ఇది.

  బొల్లోజు బాబా

  ReplyDelete
 5. chaalaa chaalaa adbhutamgaa vunnadi mee krishnaarchana...premamoorthy iyina krishna tatvam mee bhavukatha,aadi bhavuthikata kalisina mandaarakshararchanaku pulakinchipoyi mee arthini aavedananu padmalugaa maarchukuni vuntaaru...adi mee bhavana kaadu..naivedyam.pratirooju bhagavanthudi daggara chaduvukovalsina hrudaya geetam idi.thank u somuch....bhagavata tatvam kalisina aksharanjaliki krutagyatalu....

  Srimathi Jalandhara Chandra Mohan

  ReplyDelete
 6. శ్రీమతి జలంధర దంపతుల పాద పద్మాలను నమస్కరిస్తూ,

  మీరు నా భావుకతను అభినందిచటాన్ని సరస్వతీ కటాక్షంగా భావిస్తాను, మీ అవ్యాజ ప్రేమ నా పట్ల ఇలాగే ఉండాలని ఆశిస్తూ

  మీ చరణాల వద్ద పసివాడు...

  నరసింహ మూర్తి

  ReplyDelete
 7. మూర్తీ!దేవలోక పారిజాత పుష్పాలను దివి నుండి భువికి తెచ్చి........
  రస రంజిత హృదయాలను పులకింపచేసి......
  సుమ సోయగాల లో మనసు ఉయ్యాల లూపి......
  ఊహకందని లోకం లో విహరింప జేసి..............
  రెప్పపాటు లో మనసు దోచే అష్టాక్షరి ని వినిపించి........
  అదే శ్వాస లా చేసావు................... ధన్యోస్మి!
  (శివమంజరి)

  ReplyDelete
 8. కృష్ణ ప్రేమకు పులకించిన శివపాద మంజీరాలు ... నా బ్లాగ్ లో ఘల్లు ఘల్లు మని మోగుతున్నాయి...

  మీ అవ్యాజ ప్రేమకు ... శిరస్సువంచి నమస్కరిస్తూ....

  నరసింహ మూర్తి

  ReplyDelete
 9. deeni gurinchi comment raayadaiki edina entrance test pedithe baaboy naavalla kadu akkade fail....

  chinna gulakarai ethina himalayam gurinchi emcheppagaluguthundi...

  sirassu vanchi namaskaaram thappa...,,

  alaage murthi gaariki naa vandanaalu.....  shaffi

  ReplyDelete
 10. Dear Shaffi,

  సహృదయులంతా ... సెలయేరు లాగా నా పై ప్రవహిస్తూ ఉంటే .. ఆ చల్లదనం యొక్క అనుభూతిని పొందుతున్నాను ...

  షఫీ గారికి కృతజ్ఞతలు
  మీ స్పందనలే ఇంధనంగా ముందుకు కదులుతున్న
  మూర్తి

  ReplyDelete
 11. murthy gariki...

  meeru naa snehithulu ga unnaduku dhanyuraalini. inthakanna neenu emi cheppaleenu... manasu aanandma tho nindi nappudu maatalu karuvavthayi.. alaanee undi ee kavitha chadivina taruvatha...

  inka inthakanna manchi kavitha kusumaalani andachestharani korukuntu..

  mi
  jyothi.

  ReplyDelete
 12. మూర్తి గారూ
  మీ కవితలు అద్భుతంగా వున్నాయి. ముఖ్యంగా కృష్ణ తత్వం. ప్రతి వాక్యానికీ ప్రత్యేకత ఉంది.
  మీరేమీ అనుకోనంటే మీ అక్టోబరు కవితలన్నీ
  ఇవిగో ఇలా నాకు చాతనయినంతలో..


  నిను చేరుదామని
  ఎదురుచూపులు
  నిను ఎవరనుకోను
  ఎవరూలేని వింత ఎడారిలో
  నిను చేరుతూ ఉంటాను
  నిను చేరనపుడు
  నీ కవితగా మిగిలిన విశేషాన్ని
  చెమర్చిన భావం నేను
  మనస్సుని పాతిపెట్టి
  నా నిద్రవై చేరుకుంటావు
  నన్నడుగు ప్రియతమా
  అస్థిత్వం అద్దానికి అంటుతుందా
  నీ సాన్నిహిత్యం లో
  కళ్ళు మధురవేదనని అనుభవిస్తున్నాయి
  మనస్సుని పాతిపెట్టావు నేడు
  ఓ చిరుగాలిలా
  పెదవులపై మెరుపులో
  ఏముందో నీకు తెల్సు
  కలం ఖడ్గం ఒకే సమాధిలో
  సంవృతన్యాయంగా
  నిష్కల్మషంగా లక్షలతారకల సాక్షిగా పెళ్ళి
  తేనెటీగల రొద
  నాహృదయం మీద..
  నా చిరునవ్వు
  నిను చేరనపుడు
  నేను నిను చేరుతూఉంటాను
  తల్లి వాత్సల్యంతో
  నాకు నేను కాకుండాచేస్తావు
  కాలమా !
  ఏది తప్ప ? ఏది ఒప్పు ?
  పరిమళాన్నీ పట్టుకుపారిపోయే
  పిల్లగాలివి నువ్వు
  నీతో నేను కలిస్తే ఇలా ఉంటుంది
  పెళ్ళెవరికి అర్హత, ప్రపంచం
  అంటూ నువు
  ఒక్ వైపు నియమం..మరువైపు ప్రణయం
  నీవు కఠినంగా మారీకన్నా
  ఎవరికీ మాట నినని మనసు
  నీతో నాభావాలు తెలుపుదామని
  చల్లని గాలిలా మారి
  అనుభూతి కలిపితే అంతరంగాలు
  నీ అందం హృఉదయాన్ని కుచ్చుతూ...
  నా హృదయంలో అంధకారం
  ప్రేమ సందేహం లో
  చెమర్చిన భావం నేను
  నీ వెలుగులా నీ వెంట
  without you
  కడలి నిండా కన్నీరు
  ఎవరు ఆపారు ?
  నాకు కన్నీటి భాష నేర్పు
  ప్రాణమై బదులిస్తా
  తొలగిందా నీలోని అహం..

  ReplyDelete
 13. అసౌకర్యానికి బాధపడుతున్నాను.మీ కర్ధమవుతుందికదాని
  కావాలనే అక్కడితో ముగించాను.

  మీరేమీ అనుకోనంటే మీ అక్టోబరు కవితలన్నీ(అంటే శీర్షికలన్నీ)
  ఇవిగో ఇలా నాకు చాతనయినంతలో..ఒక కవితగా కూర్చడానికి ప్రయత్నించాను.
  Please remove this comment after reading.
  Thankyou.

  ReplyDelete
 14. "కవిత్వాన్ని ఆదరించే వారు రాసేవారికంటే గొప్పవారు" అని అమ్మ అన్న మాట గుర్తుకు వచ్చింది . నా కవిత్వాల టైటిల్లతో అద్భుతమైన మరో భావానికి లోను చేశారు ... మీకు కృతజ్ఞతలు...

  నమస్సులతో
  నరసింహ మూర్తి

  ReplyDelete