Oct 1, 2009

నీ ప్రేమలో .... నేను సమాధి


నీ ప్రేమలో .... నలిగిన మనసుకు, తగిలిన గాయాలకు సమాధి
ఆలోచనల అవగతానికి,వ్యక్తులకు వ్యవహారాలకు సమాధి
మనసులోని అనుమతులు,అపశ్రతులకు సమాధి
ఆరోహణా అవరోహణలకు సమాధి
తీయటి మాటలు, వెనక్కు తీసుకోలేని ఆటలకు సమాధి
దూరపు దూరాన్ని దూరం చేస్తూ దూరానికి సమాధి
ఆరాటాలు,పోరాటాలు,సయ్యాటలు సందడులు
విన్యాసాలు,వినోదాలు,విలాపాలు,వింత పోకడలకు సమాధి
కనులు చూపించిన కలల ప్రపంచానికి సమాధి
నీ ప్రేమలో  . . . . . . .  . .
నేను కనుగొన్న కళల ప్రయాణానికి,వింత ప్రణయానికి సమాధి
వెళ్ళలేని,చేరలేని తీరాలకై నే వేసిన లంగరు కు సమాధి
అగ్ని గుండం లా మారిన వలపుకి సమాధి ... నీ ప్రేమ లో ప్రియా సమాధి
వలపుల తలపులు మిగిల్చిన లోతైన గాయాలకు సమాధి
రాత్రులు,పగలు,వెన్నెల ఆకాశం ఆనందం మిగిల్చిన అనుభూతులు సమాధి
నీ ప్రేమలో . . . . . . .
చల్లని సూర్యుడు,వెచ్చని వెన్నెల .. వింత లోకాల కావ్య కాంతకు సమాధి
బంధాలు అనుబంధాలు నాతో నన్ను కోరే కారణాలకు సమాధి
పదాలకు అనుపదాలకు అవి పేర్చే గారాల కలల మేడలకు సమాధి
దుందుడుకులకు,వేగాలకు,పరుగులకు,పెరుగు తరుగులకు సమాధి
పుట్టుకలకు చావులకు నా వైపు నన్ను తీసుకు వెళ్ళే తావులకు సమాధి
పసి మనసుల అలరింపులకు,అమాయకపు స్పర్శలకు సమాధి
నీ ప్రేమలో
వయ్యారాల భామలు ఒలకబోసే వలపుల జలపాతాలకు సమాధి
దారి చూపిన దారులకు,దారి మళ్ళించిన మార్గాలకు సమాధి
మిత్రువుల శత్రువుల బంధువుల బాంధవ్యాలకు సమాధి
ఎవ్వరికీ అర్థం కాని నాలో నేనుకి సమాధి
హృదయం లో నెత్తుటి మడుగులు,నాలో మెత్తటి నీ పాదపు అడుగులకు సమాధి
నన్ను నేను నిందించుకొన్న రాత్రులకు సమాధి
బాధ్యతలు మరిచి ప్రవర్తించిన రోజులకు సమాధి
నీకై వేచి వేచి నన్ను నేను హింసించుకొన్న ఘడియలకు సమాధి
పైత్యపు పలవరింతలు, పిచ్చి చేష్టలు దిక్కులు పిక్కటిల్లేలా వేసిన కేకలకు సమాధి
నా మరణాన్ని నేను అనుభవించిన విలువయిన భయంకర క్షణాలకు సమాధి
నీవు దొరకక నీ జాడ అందక నా శ్వాసను విషం చేసుకున్న రోజులకు సమాధి
ఎర్ర బడ్డ కళ్ళకు , నిదుర చెడిన మెదడుకు సమాధి
నిన్ను చేరుకునే ఆరాటం లో నన్ను నేను చేరుకున్న వింత మజిలీకి సమాధి
ఎంత దాచినా దాగని గాయాలకు సమాధి
నిన్నే తలచి,నిన్నే చూసి నీవుగా బ్రతికిన మధుర క్షణాలకు సమాధి
ఊరట పొందిన హృదయానికి ,ఉరకలేసే తలపులకు సమాధి
నీ విరహంలో నన్ను నేను నలుపుకున్న ఆ వింత పరిమళానికి సమాధి
చిమ్మ చీకటికి ..... కాంతి పుంజానికి సమాధి
ప్రపంచం నాలో ఇష్టపడే కారణాలకు సమాధి
నా గురించి తెలియక నన్ను హింసించే లోకపు పోకడకు సమాధి
విలువయిన కాలానికి,విలువ లేని జీవితానికి సమాధి
నీ ప్రేమలో  . . . . . . . . . . . . . . . . .
ప్రేమ కోసం తపించిన హృదయానికి సమాధి
నేను అనుకుంటున్న నాకు , నేను కాని నాకు సమాధి
నీకై వగచిన మనసుకు సమాధి
నీవు కాని నీకు సమాధి
నీ ప్రేమలో
సమాధి ప్రియా నీ ......... ప్రే .... మ .... లో           స ......మా .......... ధి

2 comments:

  1. సమాధి చేయటం అంత సులువు కాదు, ఆ పని చేయలేని బలహీనతలోనే ప్రేమని ఎదిరించే విఫలయత్నం చేస్తూ తిరిగి తిరిగి సంధి చేసుకుని లొంగిపోయిన నా అనుభవం సాక్షిగా... ప్రేమ కి పుట్టటమే కానీ గిట్టటం లేదు.

    ReplyDelete
  2. ఉషగారికి నమస్కరించి,
    నేను ప్రేమను సమాధి చేయటం లేదు.ప్రేమలో నేను సమాధి అవుతున్నాను.అది నా భాగ్యం.

    ReplyDelete