Oct 3, 2009

ఖడ్గం


ఖడ్గం పదునేంటో ఒరను అడుగు ...
 మనసు పదునేంటో నా శరీరాన్ని అడుగు ...

కమలం


కమలాన్ని అడిగాను నీళ్ళపై ఎలా తేలావని ?
అధారం.. సంకల్పాన్ని తోస్తూ ఉంటే .....
ముడుచుకు ఉండలేక పొడుచుకు వచ్చానన్నది

ఏముందో ..... నీకు తెలుసు...


తూనీగల సమూహం కనబడింది
ఏదో నీటి చెలమ ఉందని తెలిసింది ...
నాలో భావాల తుంపర ఎగిసింది..
ఏముందో ..... నీకు తెలుసు...

పెదవులపై మెరుపు


నీటి గలగలా తరంగాలపై బంగారు మిల మిల
ప్రియతమా...........
ఇది నీ పెదవులపై మెరుపు కదా
ఇది మన వలపుల మైమరుపు కాదా
నా పిచ్చి నీకు తెలియంది కాదు
నన్ను భరిస్తున్న నీకు ఇది కొత్తేం కాదు

చిరు గాలి


నిదురలో ఉన్న నిన్ను, మెలకువలో ఉన్న తాను, తాకి వచ్చానని....
 బేరసారాలు ఆడింది చిరు గాలి నాతో .......
నా హృదయంలో నిన్ను గమనించి... నిశ్శబ్దమయ్యింది...
నా వెచ్చని శ్వాసతో బయలు దేరింది నీ వైపు ... దానితో కాస్త జాగ్రత్త ప్రియతమా !!

నీ సాన్నిహిత్యం



            నిన్ను చేరాక ....నీ రంగు చేరదా - ఒక సీతాకోక చిలుక
                       ఏమో నీ సాన్నిహిత్యానికే ఎరుక.......

కళ్ళు ..మధుర వేదనని అనుభవిస్తున్నాయి..


కళ్ళు తమని తాము,నిన్ను దర్శించిన చిత్రాల్లో కుంచెలా అద్దుకొని
తమ మధుర సంతకాల్ని..
నీ హృదయంలో.. లోతైన,సూక్ష్మాతి సూక్ష్మ మార్మిక మనుగడపై
వదులుదామని, ఆపై తేలికపడి...వదులుగా మారుదామని..

మాటల్లో చెప్పుకోలేని మధుర వేదనని అనుభవిస్తున్నాయి..

అస్థిత్వం అద్దానికి అందుతుందా ?


అస్థిత్వం అద్దానికి అందుతుందా ?
అద్దం నిన్ను చూపించిందా ?
లేక నీవు అనుకుంటున్న ' నిన్ను'ని  చూపించిందా ?
అరే ... మూర్తి !!  ప్రపంచం తీర్చగలదా నీ ఆర్తి  ??

నన్నడుగు ప్రియతమా !!


నీవేమిటనేది నీకు తెలియదు....
నన్నడుగు ప్రియతమా !!
నిన్ను తలచుకొని మౌనాశృవులలో మునిగి
మాట  రాక
నీ భావాల్తో ఎరుపెక్కి
ఝుమ్మంటున్న హృదయంతో
నేనే నీవై సుధా రసాలను స్రవిస్తాను ...

నా నిద్రవై చేరుకుంటావు


నాకై నేను అలిసిపోతే మౌనముద్రలో ఉంటావు
నీకై 'నే' అలిసిపొతే నా నిద్రవై చేరుకుంటావు
ఆ పై నీతో మేల్కొంటాను .. నులివెచ్చని ఉషోదయం లోకి
అరవిచ్చిన జ్ఞానంలోకి ....